వేములవాడ, సెప్టెంబర్ 03 (జాగో న్యూస్): వేములవాడ మండలం చీర్లవంచ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ అందరు ప్రోగ్రామ్ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ముఖ్యంగా అసాంక్రమిక వ్యాధుల (NCDs) నియంత్రణలో భాగంగా మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ తదితర వ్యాధులకు నిర్వహిస్తున్న స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు, చికిత్స ఫాలోఅప్ వివరాలను పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ NCD స్క్రీనింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. అదేవిధంగా ప్రస్తుత కాలానుగుణ వ్యాధులు అయిన డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్స్ తదితర వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించి, ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను లక్ష్యాల మేరకు సమర్థవంతంగా అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో కార్యక్రమాల అమలును నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగేందర్ బాబు, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ సంపత్ కుమార్,వైద్యాధికారి డాక్టర్ శరణ్య తదితరులు పాల్గొన్నారు.







