రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 03 (జాగో న్యూస్): జపాన్ లో అర్హులైన యువతకు డ్రైవర్ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. జపాన్ సంస్థ ప్రతినిధులు, జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రైనింగ్ రీసెర్చ్ సంస్థ ప్రిన్సిపాల్ దురై మురుగన్ తో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకు ముందు జపాన్ సంస్థ ప్రతినిధులు తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రైనింగ్ రీసెర్చ్ సంస్థలో పర్యటించి.. అక్కడ శిక్షణ, ఇతర అంశాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. జిల్లాలో హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి.. ఇంగ్లిష్ భాషలో పట్టు ఉన్న 25 ఏండ్ల వయసు ఉన్న యువత శిక్షణకు అర్హులని తెలిపారు. యువత తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రైనింగ్ రీసెర్చ్ సంస్థలో సంప్రదించాలని సూచించారు. జిల్లా రవాణా శాఖ, ఐడీటీఆర్ ప్రిన్సిపాల్ ఆద్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అర్హులైన వారిని ఎంపిక చేయాలని ఆదేశించారు. ఐడీటీఆర్లో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ అనంతరం జపాన్ భాషపై తర్ఫీదు ఇస్తారని తెలిపారు. శిక్షణలో ఎంపికైన వారికి జపాన్ దేశంలో ప్రతి నెలా సుమారు రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు వేతనం ఇచ్చే డ్రైవర్ ఉద్యోగ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఐడీటీఆర్ కార్యాలయం ప్రిన్సిపాల్ ఫోన్ నంబర్ 94421 25075లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జపాన్ సంస్థ ప్రతినిధులు ఓసీ బుచి, రాజు కుమార్ తదితరులు ఉన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ గూడూరి రమేష్







