రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 03 (జాగో న్యూస్): నిర్దేశిత గడువులోగా సీఎంఆర్ డెలివరీ ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. గత రెండు సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ డెలివరీ, డిఫాల్ట్ మిల్లర్లు బకాయిల చెల్లింపు, వచ్చే సీజన్ కు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పౌరసరఫరాల శాఖ అధికారులతో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ జిల్లాలో గత రెండు సీజన్లకు సంబంధించి సీఎంఆర్ డెలివరీ ప్రక్రియ వేగవంతం చేసి సూచించిన గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే సీజన్ కు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించి, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాలని సూచించారు. డిఫాల్ట్ మిల్లర్లు బకాయిలు ఖచ్చితంగా చెల్లించాలని, సకాలంలో బకాయిలు చెల్లించని రైస్ మిల్లులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, పౌర సరఫరాల శాఖ మేనేజర్ గోపాల్ ఉన్నారు.







