కరీంనగర్/చొప్పదండి, జూన్ 10 (జాగో న్యూస్): గత మూడు సంవత్సరాలుగా చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలో ఒక్క బాల్య వివాహం కూడా నమోదు కాకపోవడంతో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో చొప్పదండి మున్సిపాలిటీని అధికారికంగా బాల్య వివాహ రహిత మున్సిపాలిటీగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి మున్సిపల్ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో, 1వ వార్డు నుండి 14వ వార్డు వరకు గల కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, స్థానిక పౌరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ అధికారి (DWO) గారి పర్యవేక్షణలో మిషన్ వాత్సల్య సిబ్బంది, జిల్లా శిశు సంరక్షణ అధికారి (DCPO), సోషల్ వర్కర్, అలాగే ఐసీడీఎస్ గంగాధర ప్రాజెక్టు సీడీపీఓ, సూపర్వైజర్లు మరియు అంగన్వాడీ టీచర్లు సమన్వయంతో వివిధ శాఖల భాగస్వామ్యులతో (Stakeholders) కన్వర్జెన్స్ నిర్వహించి బాల్య వివాహాల నిరోధక చర్యలను సమర్థవంతంగా అమలు చేశారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం, అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వ శాఖల సమన్వయం మరియు స్థానిక ప్రజల సహకారం ముఖ్య పాత్ర పోషించాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలో బాల్య వివాహాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపడతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణ, బాలికల విద్యాభివృద్ధి మరియు బాల్య వివాహాల నివారణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.









