కరీంనగర్, జూన్ 16 (జాగో న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో *కనీస వేతనాలను సవరిస్తూ 30-05-2026న జీఓ ఎంఎస్ నెం.6ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మూడు జోన్లుగా, కార్మికులను 4 కేటగిరీలుగా విభజించింది. కరీంనగర్ జిల్లా లోని పాల డైరీలు, సా మిల్లులు, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్, పెట్రోల్ బంకులు, హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ లలో ఈ జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వి రమ గారు డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా ఆఫీసు ముకుందలాల్ మిశ్రా భవన్ లో సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యు శ్రీనివాస్, గీట్ల ముకుంద రెడ్డి, ఉపాధ్యక్షులు ఎం శ్రీలత, సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్, పున్నం రవి, జి రాజేశం గార్లతో కలిసి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం *రైతు డిస్కాం* అనే పేరుతో కొత్త డిస్కాం ఏర్పాటు చేసింది. ఇది రైతులకు, సామాన్య, మధ్యతరగతి వినియోగదారులకు తీవ్ర నష్టదాయకమైందని దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అప్పుల ఉబిలో కూరుకుపోయిన డిస్కాంలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.45,398 కోట్లను వెంటనే విడుదల చేయాలని సిఐటియు కోరుతుందన్నారు. రైతులు, సామాన్య, మధ్యతరగతి విద్యుత్ వినియోగదారులకు పెను భారం కానున్న డిస్కాముల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామీణ స్థాయి వరకు సభలు, సమావేశాలు, ప్రజా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు. ఆర్టీసి సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్ని అమలు చేయాలని, పెండింగ్ సమస్యలపై కార్మిక సంఘాలతో ఈడి కమిటీ చర్చలు జరుపాలి. విద్యుత్ బస్లు ఆర్టిసీ నడిపేలా విధాన మార్పులు చేయాలి. ఉద్యగ భద్రత కల్పించాలి. మహాలక్ష్మి పధకం కింద ఆర్టీసీకి రావలిసిన బకాయిలు చెల్లించాలని కోరారు. ఆశా వర్కర్లను కనీస వేతనం రూ.18,000/- పెంచి, రూ.50 లక్షల బీమా, రూ.50,000 మట్టి ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్లు తదితర సౌకర్యాలు అమలు చేసి, కేంద్ర ప్రభుత్వం పెంచిన రూ.1500/- పారితోషకాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఐసిడిఎస్ ను బలోపేతం చేయాలని, ఫ్రీ ప్రైమరీ, పిఎంశ్రీ విద్యను అంగన్వాడీలకే ఇవ్వాలని, రూ.18,000/- కనీస వేతనం చెల్లించాలని, చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పని భారాన్ని తగ్గించాలి. వేధింపులు ఆపాలి. 104 సిబ్బందికి 14 నెల వేతనాలు బకాయిలు చెల్లించాలి. పేషంట్ కేర్, శానిటేషన్ సెక్యూరిటీ తదితర ప్రభుత్వ హాస్పటల్స్లోని కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలన్నారు.








