రాజన్న సిరిసిల్ల/తంగళ్లపల్లి, సెప్టెంబర్ 01 (జాగో న్యూస్): విద్యార్థులకు యూనిఫాంలు కుట్టించడంతో మహిళా సంఘాల ఉపాధికి మార్గం చూపుతుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రెసిడెన్షియల్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంలు కుట్టించే బాధ్యతను మహిళా సంఘాలకు ఇవ్వగా, జిల్లాలో ఆ ప్రక్రియ కొనసాగుతున్నది. తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో శ్రీ రేణుక మాత మహిళాశక్తి టైలరింగ్ సెంటర్లో యూనిఫాంలు మహిళా సంఘాల సభ్యులు కుడుతుండగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. ప్రతి మహిళా రోజూ ఎన్ని యూనిఫాంలు కుడుతారు ? ఎంత ఆదాయం వస్తుంది. అనే విషయాన్ని జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. తంగళ్లపల్లి మండలంలోని మొత్తం 43 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 3,560 విద్యార్థినీ విద్యార్థులకు 2 జతల చొప్పున ఏకరూప దుస్తులు 4 కేంద్రాల ద్వారా 28 మంది మహిళా సంఘాల సభ్యులతో కుట్టిస్తున్నామని, వీటి ద్వారా రూ.5,34,000 మొత్తం ఆదాయం సమకూరనుందని అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో యూనిఫాంలు కుట్టించే బాధ్యత అప్పగించిందని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు త్వరితగతిన యూనిఫాంలు పూర్తి చేసి ఇవ్వాలని సూచించారు. ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పనిని పూర్తి చేయాలని పేర్కొన్నారు. పరిశీలనలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్, ఇంచార్జి తహసీల్దార్ మురళి, ఎంపీడీఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు.








