రాజన్న సిరిసిల్ల/తంగళ్లపల్లి, సెప్టెంబర్ 01 (జాగో న్యూస్): ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు నిరంతర ఆదాయం వస్తుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లి గ్రామంలో కంకణాల రమేష్, కంకణాల రాజు దాదాపు 4 ఎకరాల్లో బీరకాయలు, టమాట, మిర్చి, సొరకాయ, బంతి సాగు చేస్తుండగా, జిల్లా కలెక్టర్ ప్రతి మంగళవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా పరిశీలించారు. రైతులను జిల్లా కలెక్టర్ అభినందించారు. అలాగే పరిపల్లి మహేందర్ తన పొలంలో పాంపాండ్ నిర్మించుకుంటుడగా పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎల్ నినో ప్రభావానికి అధిగమించేందుకు వినూత్న విధానంలో రైతు కంకణాల రమేష్ దాదాపు 2.5 ఎకరాల్లో బీరకాయ, సొరకాయ సాగు చేస్తుండగా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం బీరకాయ పంట చేతికి వచ్చింది. బీరకాయ, సొరకాయ సాగు విధానం, సస్యరక్షణ చర్యలు, దిగుబడి, విక్రయాలు, ఆదాయం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ రైతును అభినందించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో రైతులు సంప్రదాయ పంటలు సాగు చేయకుండా కూరగాయలు సాగు చేస్తున్నారని వివరించారు. వరికి బదులుగా కూరగాయలు సాగు చేసి ఆదాయం పొందే మార్గాన్ని రైతు అవలంబిస్తున్నారని తెలిపారు. వివిధ రకాల కూరగాయలు సాగు చేయడంతో మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని, వాతావరణ ఇబ్బందులు, నీటి సమస్య దూరం చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. మిగతా రైతులు కూడా తమకు ఉన్న భూమిలో ఆరుతడి పంటలు, కూరగాయలు సాగు చేసి ఆదాయం పొందాలని, ప్రస్తుత వాతావరణ ఇబ్బందుల నుంచి బయట పడాలని పిలుపు నిచ్చారు. ఉద్యానవన శాఖ,ఇతర శాఖల నుంచి వచ్చే ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.
*విభిన్నమైన పంటలు .. క్రమంతప్పని ఆదాయం*
ఎల్ నినో ప్రభావం, ఇబ్బందులు అధిగమించేందుకు రైతు కంకణాల రాజు తనకు ఉన్న రెండు ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి ఆదాయం పొందాలనే ఉద్దేశంతో వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేస్తున్నారు. అలాగే పాంపాండ్ నిర్మాణంతో భూగర్భ జలాలు వృద్ది చెంది ఆదాయం పొందేందుకు మార్గం ఏర్పడింది. ప్రస్తుతం బీరకాయ దీనిలో మల్చింగ్ విధానంలో అంతర పంటగా టమాట, మిర్చి సాగు చేస్తున్నారు. అలాగే సొరకాయ, బంతి పూలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం బీరకాయ పంట చేతికి వచ్చింది. టమాట దిగుబడి మరికొద్ది రోజుల్లో చేతికి వస్తుంది. అలాగే మిర్చి, బంతి తోట బతుకమ్మ, దసరా పండుగల వరకు చేతికి రానుంది. బీర తోట నాటిన 45 రోజుల తర్వాత పంట చేతికి రావడం మొదలై దాదాపు 45 రోజుల నుంచి రెండు నెలల వరకు దిగుబడి వస్తుంది. ఎకరానికి అన్ని ఖర్చులు పోను రైతుకు రూ.80 వేల నుంచి రూ. లక్ష వరకు ఆదాయం సమకూరుతుందని రైతు రాజు చెప్పారు. మరికొద్ది రోజుల్లో టమాట, బంతి ఆదాయం రానుందని వివరించారు.
*భూగర్భ జలాల వృద్ది.. ఆదాయానికి మార్గం*
రైతు కంకణాల రాజు తన పొలంలో గత ఏడాది ఒక గుంట స్థలం విస్తీర్ణంలో పాంపాండ్ తవ్వించారు. దానిలో వర్షాకాలంలో నీరు నిలిచి తన బోర్ లో నీరు సమృద్దిగా వస్తుంది. తన కూరగాయలు, పూల సాగుకు నీరు పుష్కలంగా అందుతుంది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని సాగుకు అందిస్తున్నారు. ఎల్ నినో నేపథ్యంలోనూ భూగర్భ జలాలకు ఇబ్బంది లేదు.
మత్స్య *సంపద*
రైతు కంకణాల రాజు తన పొలంలోని పాంపాండ్ నీరు నింపి కొరమీను, రవు చేప పిల్లలు వేశారు. సహజ పద్దతిలో వాటిని పెంచుతున్నారు. ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి చేపలు పట్టి విక్రయిస్తుండగా, రూ.40 వేల వరకు ఆదాయం వస్తుందని రైతు తెలిపారు. పరిశీలనలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖా అధికారి లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం,ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు తదితరులు ఉన్నారు.








