ప్రతి పాఠశాల ప్రొఫైల్ తయారు చేయండి.. *ప్రభుత్వ పాఠశాలలను అత్యద్భుతంగా తీర్చిదిద్దాలి.. *ఎంఈఓల పాత్ర కీలకం.. *ప్రతి అంశంపై పూర్తి అవగాహన ఉండాలి.. *జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్, జూన్ 10 ( జాగో న్యూస్): ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థులకు ఆకర్షణీయంగా, అత్యుత్తమ విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. బుధవారం రాత్రి కలెక్టర్ తన చాంబర్‌లో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సుదీర్ఘ సమీక్ష సమావేశంలో పాఠశాలల అభివృద్ధి పనులు, మధ్యాహ్న భోజన పథకం, బడిబాట కార్యక్రమం, వర్షాకాలం నేపథ్యంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, పాఠశాలల పునఃప్రారంభ ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల నిర్వహణ, పర్యవేక్షణలో మండల విద్యాశాఖ అధికారుల (ఎంఈఓలు) పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలకు సంబంధించిన మౌలిక వసతులు, విద్యార్థుల సంఖ్య, హాజరు శాతం, విద్యా ప్రమాణాలు బోధన బోధనేతర సిబ్బందికి సంబంధించిన తదితర అంశాలు.. అభివృద్ధి పనులు, అవసరాలు వంటి అన్ని అంశాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి పాఠశాలకు సంబంధించి సమగ్ర ప్రొఫైల్ సిద్ధం చేసి ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆదేశించారు. అన్ని అంశాలను జోడించాలని సూచించారు. పాఠశాలల్లో చేపడుతున్న సివిల్ వర్క్స్ పనులు ఎక్కడైనా పెండింగ్‌లో ఉంటే వాటిని వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకుని ‘బడిబాట’ కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యా సంస్థలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, నాణ్యమైన విద్య గురించి విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని, విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఎంఈఓలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రాబోయే వర్షాకాలంలో పాఠశాలల్లో నీటి నిల్వలు, పైకప్పుల లీకేజీలు, విద్యుత్ భద్రత, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. పాఠశాలల్లో అత్యవసర మరమ్మతులు అవసరమైతే వెంటనే పూర్తి చేయాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని పేర్కొన్నారు. ప్రతి అధికారి తన పరిధిలోని పాఠశాలలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, విద్యార్థులకు ఉత్తమ విద్య అందేలా కృషి చేసి ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శవంతమైన విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సిపిఓ ఆఫీసు గణాంక అధికారి కిషన్ రావు, మండల విద్యాశాఖ అధికారులు, కోఆర్డినేటర్లు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

వివో బిల్డింగ్స్ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి.. *ఉపాధి కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించాలి.. *నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీంపై గ్రామ గ్రామాన అవగాహన కల్పించండి..*జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

గౌరవేల్లి ప్రాజెక్ట్ కాలువల భూసేకరణ వేగవంతం చేయాలి. *నియోజకవర్గంలో అభివృధి పనులకు భూ కేటాయింపులు త్వరితగతిన పూర్తి చేయాలి  *ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి.  *హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి, రెవెన్యూ అంశాలు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై అధికారులతో నిర్వహించిన వేరు వేరు సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్