కరీంనగర్, జూన్ 16 (జాగో న్యూస్): కార్పొరేట్ విద్యాసంస్థ అయిన శ్రీ చైతన్య పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న పుస్తకాల వ్యాపారాన్ని అరికట్టాలని, ఆ సంస్థ గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) కరీంనగర్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. శ్రీ చైతన్య యాజమాన్యం ఒక ప్రైవేట్ గదిని అద్దెకు తీసుకుని, తమ ఇష్టానుసారంగా పుస్తకాలు అమ్ముతున్న స్థావరం వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఆ పుస్తకాలను జిల్లా విద్యాశాఖాధికారి (DEO) కార్యాలయానికి తరలించి అక్కడ నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా *ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ..* కరీంనగర్ పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ పుస్తకాల వ్యాపారానికి తెరలేపిందని మండిపడ్డారు. ఒక్కో పదో తరగతి విద్యార్థి నుంచి పుస్తకాల కోసమే రూ. 16,000 వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ పాఠశాల కూడా క్యాంపస్‌లో గానీ, బయట ప్రైవేట్ గదుల్లో గానీ పుస్తకాలు, దుస్తులు అమ్మకూడదనే స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని గుర్తుచేశారు. కేవలం సిలబస్ పుస్తకాల జాబితాను మాత్రమే నోటీస్ బోర్డుపై పెట్టాలని, కానీ శ్రీ చైతన్య యాజమాన్యం హైకోర్టు ఉత్తర్వులను, విద్యాశాఖ జీవోలను పూర్తిగా బేఖాతరు చేస్తోందని విమర్శించారు.ప్రభుత్వ గుర్తింపు పొందిన ఎస్సీఈఆర్‌టీ (SCERT) పుస్తకాలను పక్కనబెట్టి, భారీగా కమిషన్లు ఇచ్చే ప్రైవేట్ పబ్లిషర్స్ పుస్తకాలను విద్యార్థులపై బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపించారు. ఈ అక్రమ దందా వెనుక విద్యాశాఖ అధికారుల మామూళ్ల సిత్రం కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితమవుతున్నారని, అక్రమ పుస్తకాలను డీఈఓ ఆఫీసుకు తీసుకువచ్చినా కనీసం వాటిని సీజ్ చేయలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు.మండల విద్యాశాఖాధికారులు (MEO) నిరంతరం కార్పొరేట్ విద్యాసంస్థలపై పర్యవేక్షణ చేయాలని కోరారు. అక్రమంగా పుస్తకాలు అమ్ముతున్నట్లు సమాచారం ఇచ్చినా అధికారులు రెస్పాండ్ కాకపోవడం దారుణమన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి, అక్రమ పుస్తకాల వ్యాపారానికి పాల్పడుతున్న శ్రీ చైతన్య పాఠశాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకత్వాన్ని పోలీసులు అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కంపెళ్ళి అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు వినయ్, సహాయ కార్యదర్శి బోగేశ్వర్, నాయకులు ఆకాష్, జిల్లా కమిటీ సభ్యులు సందేశ్, సన్నీ, మానస, సంజన, అంజి తదితరులు పాల్గొన్నారు.








