ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి చర్యలు తీసుకోవాలి *మానవీయ కోణంలో సేవలు అందించాలి *రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ -01 (జాగో న్యూస్): జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజల అభ్యున్నతికి అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యుడు రాంబాబు నాయక్ జిల్లా పర్యటనకు రాగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె స్వాగతం పలికి.. పుష్పగుచ్చం అందజేశారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె, కమిషన్ సభ్యుడు రాంబాబు నాయక్ తో కలిసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, పథకాల అమలు, సంక్షేమం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందుతున్న పథకాలు, సంక్షేమం, అట్రాసిటీ కేసుల పరిష్కారం గురించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించే అన్ని పథకాలు అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంఖ్య, అంబేద్కర్ ఓవర్సీస్ పథకం, కులాంతర వివాహాల ఆర్థిక చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, జాబ్ కార్డు కలిగిఉన్న ఎస్సీ, ఎస్టీలకు కల్పిస్తున్న పని వివరాలను అధికారుల ద్వారా సమీక్షించారు. ఇప్పటివరకు నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు ఛార్జ్ షీట్ దాఖలు వివరాలు తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద నమోదయిన కేసుల దర్యాప్తు త్వరితగతిన, పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. బాధితులకు నష్ట పరిహారం అందేవిధంగా చూడాలని వివరించారు. ప్రతినెలా చివరి వారంలో మండలాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించాలని పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులు అందరూ సమావేశాల్లో పాల్గొని, ప్రజల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకాలు, చట్టాల గురించి అవగాహన కల్పించాలని వివరించారు. ప్రజలకు మానవీయ కోణంలో సేవలు అందించాలని సూచించారు. ఖచ్చితంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని సూచించారు. ఏవైనా అభివృద్ధికి సంబంధించి నిధులు పెండింగ్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి విడుదల అయ్యేటట్లు చూస్తానని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ ప్రజల అభ్యున్నతితో పాటు, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా మరింత కృషి చేయాలని తెలిపారు. ఆయా శాఖల అధికారులు అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో లోని పారిశుధ్య కార్మికులకు ఎస్ బీ ఐ బ్యాంక్ ఖాతాలు తీయించాలని, దీంతో కార్మికులకు భీమా సౌకర్యం ఉందని తెలిపారు.

*జిల్లా కలెక్టర్ కు అభినందన*

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సేవలను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అభినందించారు. జిల్లా కలెక్టర్ అందరికీ ఒకే న్యాయం చేస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు, ప్రజలకు అందిస్తున్న ఉత్తమ సేవలను కొనియాడారు. ఎస్సీ, ఎస్టీలకు మరింత ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. పోలీసులు, ఇతర శాఖల అధికారుల సేవలను అభినందించారు.

*కామన్ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం*

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను జిల్లాలోని ఎస్సీ, ఎస్టీలకు క్షేత్రస్థాయిలో అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి పాఠశాల, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తూ, ప్రతి రోజూ కామన్ మెనూ అమలు చేస్తూ విద్యా బోధన సాగిస్తున్నా మన్నారు. అన్ని విద్యాలయాల్లో ప్రత్యేక అధికారులను నియమించి
తనిఖీ చేయిస్తూ.. విద్యార్థులతో కలిసి భోజనం చేసేలా చూస్తున్నామని, ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎప్పటిక ప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరికీ ఉపకార వేతనాలు, కులాంతర వివాహాల ఆర్థిక సహకారం, అంబేద్కర్ ఓవర్సీస్ ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు. జిల్లా ఎస్పీ మహేశ్ బి గితె మాట్లాడుతూ.. జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల వివరాలు తెలియజేశారు. కేసుల దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు వివరించారు. వివిధ దశల్లో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు న్యాయం కలిగేలా చూస్తామని అన్నారు. కేసుల దర్యాప్తు పారదర్శకంగా చేపడతామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు వివరాలు వెల్లడించారు. ఎస్ డీ ఎఫ్ కింద ఎస్సీలకు 169 పనులు అంచనా వ్యయం రూ. 4 కోట్ల 29 లక్షలు, ఎస్టీ లకు 38 పనులు అంచనా వ్యయం రూ. 89 లక్షలతో పనులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఈ ఏడాది మొత్తం 32 అట్రాసిటీ కేసులు నమోదు అయ్యాయని పోలీస్ శాఖ అధికారులు వివరించారు. జిల్లాలో ఎస్సీ 09 ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో 337 మంది బాలురు, 80 బాలికలు, మూడు పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో 106 మంది బాలురు, 179 మంది బాలికలు చదువుతున్నారని తెలిపారు. ఎస్సీ స్టడీ సర్కిల్ లో ఐదు నెలల ఫౌండేషన్ కోర్సు లో 97మంది అభ్యర్థులు ఉన్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం డైట్ చార్జీలు 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 1330, 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రూ.1540, ఇంటర్ నుంచి పీజీ వరకు రూ.2100 డైట్ చార్జీలు పెంచిందని, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే కాస్మొటిక్ చార్జీలు దాదాపు మూడు ఇంతలు పెంచిందని వెల్లడించారు. ఎస్టీ ఆశ్రమ స్కూల్స్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో కలిపి 85 బాలురు, 63 మంది బాలికలు ఉన్నారని వెల్లడించారు. టీజీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ లో స్కూల్, కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో కలిపి 3527 మంది ఎస్సీ విద్యార్థులు, 245 మంది ఎస్టీ విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. ఎస్టీ ఆశ్రమ పాఠశాలల్లో 85 మంది, పోస్ట్ మెట్రిక్ విద్యాలయంలో 63మంది, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో 63 మంది ఎస్సీలు, 2081 మంది ఎస్టీలు చదువుతున్నారని వివరించారు. 90 శాతం సబ్సిడీ పై 89 ఈవీ టూ వీలర్లు, 70శాతం సబ్సిడీ పై త్రీ వీలర్లు 46, 100 శాతం సబ్సిడీ పై 10 సోలార్ యూనివర్సల్ పంపు కంట్రోల్, 80శాతం సబ్సిడీ పై ఒక్కొకరికి 2 గేదెలు 49 యూనిట్లు అందించే ప్రక్రియ కొనసాగుతున్నదని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న వెల్లడించారు. ఎస్టీ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ 61 మందికి రూ.17,82,000, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ 871 మందికి రూ. రెండు కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ కింద జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు 2,315 మంది ఎస్సీలు, 436 మంది ఎస్టీలకు ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. టీ ప్రైడ్ కింద గత ఆర్థిక సంవత్సరంలో ఎస్సీలకు 233 యూనిట్లకు రూ.6 కోట్ల 90 లక్షలు, ఎస్టీలకు 76 యూనిట్లకు రూ.2కోట్ల 66 లక్షలు మంజూరు అయ్యాయని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ కులాంతర వివాహాలు చేసుకున్న 44 మంది జంటలకు 2,50,000 వేల చొప్పున రూ. 1,10,00,000 బడ్జెట్ మంజూరు అయిందని తెలిపారు. జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖ ఆద్వర్యంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ లు 5 నిర్మాణాలు రూ 2 కోట్ల 25 లక్షలతో పనులు చేపట్టామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, డిఆర్ఓ జయశ్రీ, వేములవాడ ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి, సీపీఓ శ్రీనివాసాచారి, జిల్లా ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి సంగీత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ అధికారులు, వివిధ సంఘాల నాయకులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్