రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ -01 (జాగో న్యూస్): ఆయిల్ పామ్ సాగుతో వచ్చే లాభాలు, ప్రభుత్వ సబ్సిడీపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రి-యునిక్ కంపెనీ, డ్రిప్ కంపెనీల ప్రతినిధులతో ఆయిల్ పామ్ సాగు పురోగతి, లక్ష్యాన్ని చేరుకోవడంపై మంగళవారం జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 2958 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అవుతుందని, గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 960 ఎకరాల్లో 1500 టన్నుల ఆయిల్ పామ్ పంట దిగుబడి విక్రయించారని, రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.3 కోట్ల 45 లక్షలు జమ అయిందని అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళారు. ప్రస్తుతం ఆయిల్ పామ్ టన్ను ధర రూ.24వేల 25 రూపాయలు ఉందని తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు ఆయిల్ పామ్ మొక్కలు నాటే, డ్రిప్ ఇరిగేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రతి పనికి గడువు విధించి.. పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. ఆయిల్ పామ్ దిగుబడి, ధరను రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులకు కలిగే ఆర్థిక ప్రయోజనాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు రైతులకు నిర్వహించాలని ఆదేశించారు. రైతులకు అవసరమైన సాంకేతిక సహకారం సకాలంలో అందేలా ఉద్యాన, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డ్రిప్ ఏర్పాటు, మొక్కల సరఫరా ప్రక్రియల్లో జాప్యం లేకుండా సంబంధిత కంపెనీ ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఆర్.శరత్ బాబు, జిల్లా వ్యవసాయ అధికారిణి అఫ్జల్ బేగం, ఉద్యానవన శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.








