కరీంనగర్, సెప్టెంబర్ 01 (జాగో న్యూస్): వృద్ధులకు ఆప్యాయత.. దివ్యాంగులకు భరోసా.. వారి బాగోగులే లక్ష్యంగా కార్ఖానాగడ్డలోని ప్రభుత్వ వృద్ధులు, దివ్యాంగుల వసతిగృహాన్ని మరింత సుందరంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. మంగళవారం సాయంత్రం వసతిగృహాన్ని సందర్శించిన కలెక్టర్.. అక్కడి వృద్ధులు, దివ్యాంగులతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. వసతిగృహంలో అందుతున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి.. ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇప్పటికే చేపట్టిన ఆధునీకరణ పనులను పరిశీలించారు. గతంలో మంజూరైన నిధులతో చేపట్టిన పనులు ఎంతవరకు పూర్తయ్యాయి.. ఇంకా చేపట్టాల్సిన పనులు ఏమిటి.. ఇప్పటివరకు ఎలాంటి పనులు నిర్వహించారనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెయింటింగ్ పనులను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వృద్ధులు, దివ్యాంగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వసతిగృహంలో అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు. వసతిగృహాన్ని అత్యద్భుతంగా ఆధునీకరించి, సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని, వారి అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు మెరుగుపర్చాలని ఆదేశించారు. మౌలిక వసతుల కల్పనతో పాటు అవసరమైన మరమ్మతు పనులకు ఫేజ్-2 కింద మరిన్ని నిధులు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు, అంచనాలను సిద్ధం చేయాలని జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతిని ఆదేశించారు. వృద్ధులు, దివ్యాంగులకు మెరుగైన సౌకర్యాలు అందేలా సంక్షేమ శాఖ ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. వసతిగృహం కేవలం నివాస ప్రదేశంగా కాకుండా వృద్ధులు, దివ్యాంగులకు ఆత్మీయత, భద్రత, సౌకర్యం కలిగించే మంచి వాతావరణంగా ఉండేలా తీర్చిదిద్దాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి, వార్డెన్ రాధిక, స్వప్న తదితరులు పాల్గొన్నారు.








