కరీంనగర్/నగునూర్, సెప్టెంబర్ 01 (జాగో న్యూస్): కళాశాలలోని వసతులను పరిశీలిస్తూ.. విద్యార్థుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ.. వారితో ఆప్యాయంగా ముచ్చటిస్తూ.. వారి భవిష్యత్ లక్ష్యాలపై దిశానిర్దేశం చేస్తూ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆత్మీయత చాటారు. విద్యార్థులతో కలిసిమెలిసి మాట్లాడిన ఆమె.. వారి సమస్యలను తెలుసుకుని, “కష్టపడి చదువుకోండి.. ఉన్నత లక్ష్యాలను సాధించండి.. మీ కలలను సాకారం చేసుకోండి” అంటూ వారిలో ఆత్మవిశ్వాసం నింపారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూరులోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను కలెక్టర్ చిత్రా మిశ్రా మంగళవారం సాయంత్రం తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం తయారు చేస్తున్న వంటలను పరిశీలిస్తూ.. ఏం కూర వండుతున్నారని అడిగి తెలుసుకున్నారు. అన్నం నాణ్యతను పరిశీలించారు. అనంతరం స్టోర్ రూమ్‌ను సందర్శించి కూరగాయలు, పండ్లు, ఇతర సామగ్రిని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడారు. “ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? భోజనం బాగుంటుందా? మెనూ ప్రకారం పెడుతున్నారా. చదువు ఎలా సాగుతోంది? యూనిఫామ్స్, పుస్తకాలు వచ్చాయా?” అంటూ ఒక్కో అంశంపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలను ఓపికగా వింటూ వారికి భరోసా కల్పించారు. కళాశాలలోని రిజిస్టర్లను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ.. కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. క్రమశిక్షణ, సిన్సియారిటీతో చదువుతూ తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. కలలు కనడమే కాదు.. వాటిని సాకారం చేసుకునేందుకు ఇప్పటి నుంచే కష్టపడాలని సూచించారు. కళాశాలలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాలతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








