రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 10 (జాగో న్యూస్): పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్టించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె ప్రారంభించారు. అనంతరం పోస్టర్లు ఆవిష్కరించారు. 2 వేల విగ్రహాలను పంపిణీ చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ..గణేష్ నవరాత్రి ఉత్సవాలను పర్యావరణహితంగా నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP)తో తయారు చేసిన వినాయక విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని కోరారు. పర్యావరణహితమైన గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ప్రకృతి, జలవనరులను కాపాడుతూ భక్తిశ్రద్ధలతో పండుగను చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆయా శాఖల అధికారులు, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఏఈఈ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ జర్నలిస్టు గూడూరి రమేష్







