రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 10 (జాగో న్యూస్): ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ 2026- 2027 ధాన్యం కొనుగోళ్ల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ హాజరయ్యారు. వ్యవసాయ శాఖ అధికారుల అంచనా మేరకు దాదాపు 2,40,000 మెట్రిక్ టన్నుల సన్న, దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఐకేపీ 136, పీఏసీఎస్ 96, డీసీఎంఎస్ 1, మెప్మా ఆద్వర్యంలో 7 మొత్తం 236 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ జిల్లాలో అక్టోబర్ చివరి వారం నుంచి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారని తెలిపారు. లారీల కాంట్రాక్టర్లు తాము అగ్రిమెంట్ ప్రకారం వాహనాలు అందుబాటులో పెట్టేలా చూడాలని, అన్నిటికి జీపీఎస్ యంత్రాలు ఏర్పాటు చేసేలా చూడాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో కొత్త గన్ని సంచులు 10,83,500, పాత గన్ని సంచులు 2,60,000 ఉన్నాయని వెల్లడించారు. మిగతా కొనుగోళ్లకు అనుగుణంగా గన్ని సంచులు తెప్పించాలని సూచించారు. 4335 టార్పాలిన్లు, ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లు 2, గ్రైన్ కాలిపర్స్ 270, తేమ యంత్రాలు 333, ఎలక్ట్రానిక్ వేయింగ్ యంత్రాలు 630, హస్క్ రిమూవర్లు 270, డ్రైయర్స్ 2 ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు శ్రీధర్ బాబు, కే ఎస్ బీ కుమారి, డీసీఎస్ఓ బుచ్చిబాబు, డీఎం గోపాల్, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా సహకార శాఖ అధికారి రామకృష్ణ, వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ప్రకాష్, మార్క్ ఫెడ్ అధికారి హబీబ్, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ గూడూరి రమేష్







