హైదరాబాద్, మే 12 (జాగో న్యూస్): కేంద్ర ప్రభుత్వం మరియు NTA (National Testing Agency ) కలిసి లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యాన్ని ప్రమాదంలోకి నెట్టాయని టీపీసీసీ మెడికల్ & హెల్త్ విభాగం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ ఎం. రాజీవ్ పేర్కొన్నారు. ఈసారి దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థులు NEET పరీక్ష రాయగా, మన రాష్ట్రం నుండి దాదాపు 70 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. గతంలో కూడా NEET పరీక్ష పేపర్ లీక్ అయినప్పటికీ, ఈసారి అయినా పకడ్బందీగా, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరీక్ష నిర్వహిస్తారని అందరూ ఆశించారు. కానీ ఏ మాత్రం బాధ్యత లేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం బాధాకరం. ఇప్పటికే NMC నిబంధనలను సడలిస్తూ, వైద్య ప్రమాణాలను పాటించకుండా మెడికల్ కాలేజీలకు ఇష్టానుసారంగా అనుమతులు ఇస్తూ వైద్య విద్యను ప్రమాదంలో పెట్టడమే కాకుండా, ప్రజల ప్రాణాలను కూడా ప్రమాదంలో పెడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అధికారికంగా NEET పేపర్ లీకేజ్ జరిగిన విషయం నిర్ధారణ కావడం, 180 ప్రశ్నల్లో 135 ప్రశ్నలు లీక్ కావడం దేశ విద్యా వ్యవస్థకు మచ్చగా మారిందన్నారు. నీట్ పరీక్షను నిర్వహించే NTA కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తోంది కాబట్టి, ఈ ఘటనపై పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని డాక్టర్ రాజీవ్ స్పష్టం చేశారు. విద్యార్థుల కష్టం, తల్లిదండ్రుల ఆశలు, వారి భవిష్యత్తుతో ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఖండనీయమని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.








