కరీంనగర్, మే 12 (జాగో న్యూస్): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పేపర్ లీక్ ఘటన విద్యార్థుల భవిష్యత్తును తీవ్ర అనిశ్చితిలోకి నెట్టిందని బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి దొగ్గిలి శ్రీధర్ ఆందోళన వ్యక్తం చేశారు. కష్టపడి చదివే విద్యార్థుల నమ్మకాన్ని దెబ్బతీసే ఇటువంటి ఘటనలు విద్యా వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. ప్రత్యేకించి గ్రామీణ మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎంతో శ్రమించి పరీక్షలకు సిద్ధమవుతుంటే, కొందరు అక్రమ మార్గాల్లో లాభాలు పొందడం అన్యాయమని అన్నారు. నీట్ పరీక్షల్లో పారదర్శకత, నిష్పక్షపాత విధానం తప్పనిసరిగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం మరియు సంబంధిత దర్యాప్తు సంస్థలు తక్షణమే సమగ్ర విచారణ జరిపి అసలు నిందితులను బయటకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణలో సాంకేతిక భద్రతా చర్యలు మరింత బలోపేతం చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో పర్యవేక్షణ వ్యవస్థను కట్టుదిట్టం చేసి, అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన నిఘా అవసరమన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ధైర్యంగా ముందుకు సాగాలని, నిజాయితీగా కృషి చేసిన వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని దొగ్గిలి శ్రీధర్ తెలిపారు.








