కరీంనగర్, మే 30 (జాగో న్యూస్): జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం టీబీ అలర్ట్ ఇండియా, స్టేట్ టీబీ సెల్ తెలంగాణ మరియు సాథీ (SAATHII) సంస్థల సహకారంతో చిన్నారుల్లో క్షయవ్యాధి (టీబీ) కేసులను ముందస్తుగా గుర్తించడం, సమయానుకూలంగా చికిత్స అందించడం మరియు వ్యాధి వ్యాప్తిని నివారించడంపై జిల్లా స్థాయి క్యాచ్-అప్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ, చిన్నపిల్లల్లో టీబీ లక్షణాలను తొలిదశలోనే గుర్తించడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చని తెలిపారు. ప్రతి వైద్యాధికారి తమ పరిధిలోని అనుమానిత కేసులను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన పరీక్షలు నిర్వహించి, తగిన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వం చేపడుతున్న జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం (NTEP) లక్ష్యాలను సాధించడంలో ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, ముఖ్యంగా చిన్నారుల్లో టీబీ కేసుల గుర్తింపు, సంపర్కుల పరిశీలన (Contact Tracing) మరియు చికిత్స పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.ఈ శిక్షణ కార్యక్రమంలో నిపుణులు చిన్నారుల్లో టీబీ నిర్ధారణ, చికిత్సా విధానాలు, సాంకేతికత ఆధారిత యాక్టివ్ కేస్ ఫైండింగ్, డేటా నిర్వహణ మరియు ఫీల్డ్ స్థాయి అమలు అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీందర్ రెడ్డి జిల్లా టిబి కంట్రోల్ ఆఫీసర్ , డాక్టర్ సుధ అడ్డిషనల్ DMHO, జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు మరియు ఆరోగ్య సంస్థల వైద్యాధికారులు, కార్యక్రమ నిర్వాహకులు, సూపర్వైజరీ సిబ్బంది మరియు సంబంధిత ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.








