ప్రజల చేరువకే ప్రభుత్వ పథకాలు ➡️గ్రామసభల ద్వారా అవగాహన పెంపు ➡️బీఆర్ఎస్ పాలనలో ప్రచారం జాస్తి- అభివృద్ధి నాస్తి ➡️చేసిందే చెప్పడం కాంగ్రెస్ సర్కార్ నైజం ➡️నల్లగొండ సభలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి

కరీంనగర్/తిమ్మాపూర్, ఏప్రిల్ 02 (జాగో న్యూస్): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత వేరువ చేసేందుకే ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామసభలు నిర్వహిస్తున్నామని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు. గురువారం తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో ప్రజాపాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన గ్రామ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పరిపూర్ణ అవగాహన కల్పించాలన్నదే గ్రామసభల ప్రధానోద్దేశమని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో చేపట్టని అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పాలనలో అమలు చేస్తున్నామన్నారు. ఈ గ్రామ సభల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులను గురించి వాస్తవాలను మాత్రమే ప్రజలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, సన్నరకం వడ్లకు బోపస్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు కొత్త రేషన్ జారీ, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు, వాటి ద్వారా చేకూరుతున్న లబ్ధి గురించి ఆయన ప్రజలకు వివరించారు. అలాగే త్వరలో కొత్తగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, అల్పాహారం వంటి తదితర పథకాల ద్వారా మరింత మేలు చేకూరుతుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధిని కాంక్షిస్తూ పథకాలను అమలు చేస్తున్నదని, ఆయా పథకాల్లో మహిళలకు పెద్దపీట వేసిందన్నారు. అంతే కాకుండా ఇప్పటి వరకు మూడు పర్యాయాలు మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలిచ్చిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే దక్కిందన్నారు. మహిళల పేరిట ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ వారి సొంతింటి కలలను సాకారం చేస్తున్నామన్నారు. నివేశన స్థలాలు లేని వారికి ప్రభుత్వపరంగా స్థలాలు ఇస్తూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులును చేయాలన్న రేవంత్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని ఆయన గుర్తు చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో మహిళల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారన్నారు. గత బీఆర్ఎస్ పాలకులు ఊకదంపుడు ఉపన్యాసాలు, అదరగొట్టే మాటలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని, వాటిని ఆచరణలో పెట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి విమర్శించారు. వడ్డీ లేని రుణాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరిట మహిళలను గత ప్రభుత్వం దగా చేసిందని డాక్టర్ కవ్వంపల్లి కన్నెర్ర చేశారు. రైతు బంధు,రైతు భీమా పేరిట కేసీఆర్ ఓట్లు దండుకునేందుకే ప్రయత్నించారే తప్ప చిత్తశుద్ధితో దాన్ని అమలు చేయలేకపోయారన్నారు. రైతుల కన్నీళ్లు తుడవడం, వారి కళ్లల్లో ఆనందాన్ని చూడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయం,విద్య,వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. ప్రజలకు ఎన్నో విధాలుగా మేలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలవాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కరానికి గ్రామ సభలు తోడ్పడతాయన్నారు. సమస్యల పరిష్కారానికి ఇవి వేదికవుతాయన్నారు. గ్రామసభల్లో అన్ని ప్రభుత్వశాఖలు ప్రగతి వివరాలు వెల్లడించడం ద్వారా ప్రజలకు పథకాలపై అవగాహన పెరుగుతుందన్నారు. ఫలితంగా ప్రభుత్వ పథకాల ద్వారా మరింత లబ్ధిపొందేందుకు వీలు కలుగుతుందన్నారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని, అభివృద్ధికి అందరూ పాటుపడాలని ఆమె కోరారు. అంతకు ముందు నల్లగొండ గ్రామానికి సంబంధించి వివిధ శాఖల ద్వారా చేపట్టి అభివృద్ధి పనుల గురించి అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ గ్రామ సర్పంచ్ జింక మారుతి, మండల తహసీల్దార్ కర్ర శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహణాధికారి శ్రీనివాస్, జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఉప అధికారి డాక్టర్ రాజగోపాల్,ట్రాన్స్ కో కార్యనిర్వాహక ఇంజినీర్ ఎండీ ఖాసిం, ఐకేపీ ఏపీఎం వాణిశ్రీ, ఐసీడీఎస్ అధికారులు శ్రీలత, ఫర్వీన్, ఎంపీవో శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, గృహనిర్మాణ సంస్థ ఏఈ సాయిశ్రీజ, ఉప సర్పంచ్ రేణుక, తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, పార్టీ నాయకులు మోరపల్లి రమణారెడ్డి, శ్రీగిరి రంగారావు,బుధారపు శ్రీనివాస్,గోగూరి నర్సింహారెడ్డి, చింతల లక్ష్మారెడ్డి, రాము,రమేశ్, మార్క నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

కరీంనగర్ జాగృతిలోకి పలువురు నాయకులు జాగృతిలోకి చేరిక. *తెలంగాణ సమూల అభివృద్ధే జాగృతి లక్ష్యం. *జాగృతి ద్వారా కొత్తతరం రాజకీయాలు చూస్తారు. *రాష్ట్ర నలుమూలల నుండి పార్టీ ఆవిర్భావ సభకు జాగృతి నాయకులు కదలిరావాలి. *జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత