వరంగల్, ఏప్రిల్ 02 (జాగో న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ నియమ, నిబంధనలు ఉల్లంఘిస్తూ, ముందస్తు స్కూల్ మరియు ఇంటర్మీడియట్ అడ్మిషన్లు చేపడుతున్న ప్రైవేట్ ,కార్పొరేట్ విద్యాసంస్థల పై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పి.డి.ఎస్.యు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వి, ప్రధాన కార్యదర్శి సాయిబోలా అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కాకతీయ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) వరంగల్-హన్మకొండ జిల్లా కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షులు బోయినపల్లి అజయ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కాంపాటి పృద్వి, సాయిబోలా అనిల్ లు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాల చేతుల్లో రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత విద్యాశాఖ అధికారులు కీలుబొమ్మలుగా మారడంతో విద్యారంగం పూర్తిగా వ్యాపారమయంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నియమ, నిబంధనలు యదేచ్ఛగా ఉల్లంఘిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం వలన విద్యా సంవత్సరం పూర్తి కాకుండానే ప్రైవేట్ విద్యాసంస్థలు హై స్కూల్, ఇంటర్మీడియట్ లో ముందస్తు అడ్మిషన్లను చేసుకుంటున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని హాఫ్ డే స్కూల్స్ నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేస్తే, ఆ ఉత్తర్వులను ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు తుంగలో తొక్కి సాయంత్రం వరకు స్కూల్స్ నిర్వహిస్తున్నాయని, ఇవన్నీ సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారుల కనుసన్నల్లోనే నడుస్తున్నాయని తెలిపారు. విద్యా హక్కు చట్టానికి ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తూట్లు పొడుస్తున్న విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఒక్క స్కూల్ పేరిట పర్మిషన్ తీసుకొని, ప్రభుత్వం నుండి ఎలాంటి పర్మిషన్ లేకుండానే పదుల సంఖ్యలో బ్రాంచీలను, వాటికి అనుబంధంగా హాస్టల్స్ ను నెలకొల్పుకుంటూ, టెక్నో,ఇ-టెక్నో, గ్లోబల్, ఒలంపియాడ్, ఇంటర్నేషనల్, నీట్, ఐఐటి ఫౌండేషన్ లాంటి తోక పేర్లు తగిలించుకొని పేద, మధ్య తరగతి వర్గాల నుండి లక్షలాది రూపాయల ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నారని తీవ్రంగా ఆక్షేపించారు.b9వ తరగతి పూర్తికాకుండానే ఆ విద్యార్థులకు పదవ తరగతి పాఠాలు బోధిస్తూ విద్యార్థులను మానసికంగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రభుత్వ నియమ, నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వాటి గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పి.డి.ఎస్.యు. ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని ,సంబంధిత విద్యాశాఖ అధికారులను హెచ్చరించారు. ఈ సమావేశంలో పి.డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నరసింహారావు, జిల్లా ఉపాధ్యక్షులు గణేష్, పి. అనూష ,సహాయ కార్యదర్శులు వి. కావ్య, కే.సంగీత, జిల్లా నాయకులు హర్షిత, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.









