ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలి  *ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి  *కోతుల బెడదను నివారించాలి  *సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవ రెడ్డి డిమాండ్

కరీంనగర్, ఏప్రిల్ 16 (జాగో న్యూస్): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి త్వరితగతిన కొనుగోలు వేగవంతం చేయాలని, కోతుల బెడదను శాశ్వతంగా నివారించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం కామ్రేడ్ జక్కుల రమేష్ యాదవ్ అధ్యక్షతన ఒక ప్రైవేట్ విద్యాసంస్థలో జరిగింది. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ పెట్టుబడిదారులకు అనుకూలమైన చట్టాలు, శాసన నిర్ణయాలు చేస్తున్నాయన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందని కొత్త చట్టాలు ముమ్మాటికి కార్మికులను మరింత కట్టు బానిసలుగా చేసే చట్టాలన్నారు. గతంలో ఉన్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి, విబిజీ రాంజీ పథకాన్ని తెచ్చారని ఈ చట్టం ఉపాధి కూలీల పొట్ట కొట్టే విధంగా ఉందన్నారు. రైతు వ్యతిరేక విత్తన చట్టం, విద్యుత్ సంస్కరణ చట్టాన్ని తెచ్చారని, ఈ చట్టాలతో రైతు మెడపై ఉరితాడు బిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్సిడీలు ఎత్తివేసి, ఉచిత విద్యుత్ రద్దు చేసే కుట్రలో భాగమేనన్నారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగం ఎప్పుడు లేనంతగా పెరిగిపోయిందన్నారు ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసి రైతులకు రెట్టింపు ఆదాయం సమకూర్చాలన్నారు. సీటు ప్లస్ 50% లెక్కగట్టి మద్దతు ధరలు నిర్ణయించాలన్నారు. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారన్నారు.మతోన్మాద ఏజెండాతో మనుధర్మ శాస్త్రాన్ని ముందుకు తెచ్చే కుటిల ప్రయత్నాలు చేస్తుందన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థలైన సిబిఐ, ఐటీ, ఈడి ఎన్నికల కమిషన్ తమ జేబు సంస్థలుగా బిజెపి వాడుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసంఘటిత రంగాల కార్మికుల పై నిర్బంధ కాండ కొనసాగిస్తుందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరమైనట్టు ముందస్తు అరెస్టులు చేస్తుందన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే అక్రమ అరెస్టు లేనా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు బస్సు ఫ్రీ తప్ప ఏ ఒక్క హామీ సంపూర్ణంగా అమలు కాలేదు అన్నారు. మహిళలకు నెలకు 2500, తులం బంగారం, బాలికలకు స్కూటీలు, నిరుద్యోగ భృతి, అన్ని పంటలకు బోనస్, తదితర హామీలు నేటికీ నెరవేర్చలేదన్నారు. రాబోయే కాలంలో స్థానిక సమస్యలపై ఇంటింటికి వెళ్లి అధ్యయనం చేసి వాటి పరిష్కారం కై ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా కోతుల బెడద తీవ్రంగా ఉందని ప్రతి రోజు కోతుల దాడులతో అనేకమంది ఆసుపత్రుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పంటలను ధ్వంసం చేస్తూ రైతులను ఆర్థికంగా నష్టం చేస్తున్నాయన్నారు. కోతుల బెడదను శాశ్వతంగా నివారించే పరిష్కార మార్గాలు వెతికి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే ను గ్రామ గ్రామాన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పేద ప్రజల దాహార్తి తీర్చే చలివేంద్రాలు, ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల కమిటీ సభ్యులు జక్కుల రమేష్ యాదవ్, దండిగారి సతీష్, కన్నం సదానందం, వడ్లూరి కిషోర్, గేరా రాజకుమారి, గడ్డం శోభన్, బైరం సమ్మయ్య, సిహెచ్ రామస్వామి, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

కరీంనగర్ జాగృతిలోకి పలువురు నాయకులు జాగృతిలోకి చేరిక. *తెలంగాణ సమూల అభివృద్ధే జాగృతి లక్ష్యం. *జాగృతి ద్వారా కొత్తతరం రాజకీయాలు చూస్తారు. *రాష్ట్ర నలుమూలల నుండి పార్టీ ఆవిర్భావ సభకు జాగృతి నాయకులు కదలిరావాలి. *జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 

రోడ్డు ప్రమాదాల నియంత్రణే ప్రథమ లక్ష్యం.. *రోల్ మోడల్ గా కరీంనగర్ నిలుస్తుంది.. *అరైవ్ అలైవ్ కార్యక్రమం విజయవంతానికి ప్రత్యేక కృషి.. *ప్రతి ఒక్కరు సహకరించాలి.. *జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా