తెలంగాణ బ్యూరో, జూలై 12 (జాగో న్యూస్): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను తక్షణమే అమలు చేసి, వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో నిర్వహించిన సంఘం చిలుకూరు గ్రామ ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన హామీలను ఆలస్యం చేయకుండా అమలు చేయాలని, ముఖ్యంగా ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా వికలాంగుల సామాజిక భద్రతా పెన్షన్‌ను రూ.6,000లకు పెంచాలని, రాష్ట్రంలో ఉన్న అన్ని (ఆర్టీసీ) బస్సుల్లో వికలాంగులకు 100 శాతం రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి వెంటనే ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని, మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనమై ఉన్న వికలాంగుల సంక్షేమ శాఖను వేరుచేసి ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం 2016లో వికలాంగుల రక్షణకై తీసుకు వచ్చిన వికలాంగుల అట్రాసిటీ చట్టం–2016ను సమర్థవంతంగా అమలు చేసి, చట్టం నిబంధనల మేరకు అన్ని రంగాల్లో వికలాంగులకు జనాభా దామాషా ప్రకారం అవకాశాలు కల్పించడంతోపాటు, కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించేలా తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేయాలని, రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో ఒక మహిళ వికలాంగురాలికి, ఒక పురుష వికలాంగుడికి గ్రామపంచాయతీ కోఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించాలని, తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్‌లోను వికలాంగులకు అవకాశం కల్పించి వికలాంగుల సంక్షేమ శాఖకు వికలాంగునే మంత్రిగా నియమించాలని, రాష్ట్రంలో నూతన పింఛన్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, త్వరలో లక్షలాదిమంది వికలాంగులతో చేపట్టే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ ముట్టడికి చిలుకూరు గ్రామం నుంచి వికలాంగులు ఎక్కువ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం మండల విద్యార్థి భాగం నాయకులు యరగాని బజార్, సంఘం చిలుకూరు గ్రామ శాఖ నాయకులు కస్తూరి వీరబాబు, గజ్జి సైదులు, కిట్టమ్మ రమేష్ తదితరులు పాల్గొన్నారు.








