కరీంనగర్, మే 29 ( జాగో న్యూస్): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్.) కార్యక్రమం ద్వారా ప్రతి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల నమోదు అధికారులు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎస్.ఐ.ఆర్ పై శిక్షణా కార్యక్రమం, మ్యాపింగ్ పురోగతిని సమీక్షించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ 1950 నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 సార్లు ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో గతంలో 2002 లో ఎస్.ఐ.ఆర్. కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఎస్.ఐ.ఆర్ కార్యక్రమం ద్వారా శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు, మరణించిన ఓటర్ల వివరాల తొలగింపు, డబుల్/ డూప్లికేట్ ఎంట్రీల తొలగింపు జరుగుతుందని తెలిపారు. అక్టోబర్ 1, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించనున్నట్లు చెప్పారు. జూన్ 25 నుండి జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను పూర్తిస్థాయిలో ధృవీకరించాలని ఆదేశించారు. ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని, ప్రతి అర్హత ఓటరిని గుర్తించి జాబితాలో చేర్చాలని తెలిపారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితా సిద్ధం చేసే ముందు ప్రతి వివరాలు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఒక కుటుంబ సభ్యులందరూ ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉండేలా చూడాలని, 1200 మంది ఓటర్ల సంఖ్య దాటితే కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి బీ.ఎల్.వో వద్ద ఎన్యుమరేటర్ ఫారాలు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడాలని, ఎన్యుమరేషన్ సమయంలో ఎలాంటి ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రతి బీ.ఎల్.వో.కు ఎస్.ఐ.ఆర్ నిబంధనలు, విధి విధానాలు, ఫీల్డ్ వెరిఫికేషన్ విధానం, ఫారాల నిర్వహణపై పూర్తి అవగాహన, పట్టు ఉండేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. శిక్షణ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డ్రాఫ్ట్ జాబితా విడుదల అనంతరం మ్యాపింగ్‌లో లోపాలు ఉంటే సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. భారత పౌరసత్వ నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జూలై 1, 1987కు ముందు జన్మించిన వారు తమ స్వీయ గుర్తింపు లేదా జనన ఆధార పత్రాలు సమర్పిస్తే సరిపోతుందని, తల్లిదండ్రుల పత్రాలు అవసరం లేదన్నారు. జూలై 1, 1987 నుంచి డిసెంబర్ 2, 2004 మధ్య జన్మించిన వారు తమ పత్రాలతో పాటు తల్లి లేదా తండ్రి ఎవరి అయినా ఒకరి పత్రం సమర్పించాలని, డిసెంబర్ 2, 2004 తర్వాత జన్మించిన వారు తల్లిదండ్రుల ఇద్దరి పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు పేర్కొన్నారు. ముసాయిదా జాబితా ప్రచురణ అనంతరం ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, కొత్త క్లెయిమ్‌లు, దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి దరఖాస్తుపై ఫీల్డ్ స్థాయిలో విచారణ నిర్వహించాలని, ఎటువంటి ఫిర్యాదును నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ జరుగుతుందని, సెప్టెంబర్ 28 వరకు వాటి పరిష్కార ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. తుది ఓటరు జాబితాను అక్టోబర్ 1న ప్రచురించనున్నట్లు పేర్కొన్నారు. మ్యాపింగ్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధుల పాత్ర కేవలం ఇళ్ల గుర్తింపు, వ్యక్తుల గుర్తింపుకు మాత్రమే పరిమితం కావాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ వ్యక్తులు ఎస్.ఐ.ఆర్. ప్రక్రియ నిర్వహిస్తున్నారనే భావన ప్రజల్లో కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని రాజకీయ పార్టీలతో సమన్వయం కొనసాగించాలని, ఎన్నికల ప్రక్రియలో పూర్తిస్థాయి నిష్పాక్షికత పాటించాలని తెలిపారు. అన్ని పార్టీలకు సమాన దూరంలో ఉండటమే కాకుండా, అది స్పష్టంగా కనిపించేలా అధికారులు వ్యవహరించాలని ఆదేశింశారు.









