ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య – సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు, సర్పంచ్‌ పొన్నం సునీత అనిల్‌ గౌడ్‌ – పదిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు

కరీంనగర్/తిమ్మాపూర్, మే 05 (జాగో న్యూస్): ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపడటంతో పాటు, నిష్ణాతులైన ఉపాధ్యాయులు బోధన అందిస్తున్నారని తిమ్మాపూర్‌ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు, మన్నెంపల్లి సర్పంచ్‌ పొన్నం సునీత అనిల్‌ గౌడ్‌ అన్నారు. 2025–26 విద్యా సంవత్సర పదో తరగతి పరీక్షల్లో మన్నెంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధించిన సందర్భంగా, సోమవారం పాఠశాలలో అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా సర్పంచ్‌ హాజరై 500 లకు పైగా మార్కులు సాధించిన నలుగురు విద్యార్థులను సన్మానించారు. జ్ఞాపికలు అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. ఈ ఫలితాల సాధనలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. మోహన్‌ రావు,ఉపాధ్యాయ బృందం చేసిన కృషిని కొనియాడారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, తమ పాఠశాలలో చేరే విద్యార్థుల చదువుకు, భవిష్యత్‌ ప్రగతికి పూర్తి బాధ్యత వహిస్తామన్నారు. వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ బూడిద కిషోర్, మాజీ ఉపసర్పంచ్‌ పొన్నం అనిల్‌ గౌడ్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు